తిరుత్తణి స్వామికి టీటీడీ సారె

భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుత్తణిలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ గురువారం సమర్పించింది.  ఆఢికృతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ 2006 నుండి శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తోంది.

తిరుత్తణి చారిత్రక ప్రాశస్త్యం

తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ”ఆరుపడైవీడు” లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవల్లీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.

ఈ క్షేత్రానికి మరొక ముఖ్యమైన పురాణ ప్రాశస్త్యం ఏమిటంటే ఇక్కడి పుష్కరిణి (నంది నది)లో  సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో  ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడని ప్రతీతి. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆఢికృత్తిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూలతో అలంకరించిన కావడులను తీసుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించుకుంటారు.