Fire Theyyam- తెయ్యంలో అతి శక్తివంతమైన అగ్నిప్రవేశ ఘట్టం ఎలా జరుగుతుంది?

అగ్ని ప్రవేశం అనేది కేరళలో జరిగే తెయ్యం అనే ఆధ్యాత్మిక ప్రజా కళల్లో చాలా ముఖ్యమైన భాగం. ఈ సమయంలో తెయ్యం ప్రదర్శన చేసే వ్యక్తి (వేషధారి) పవిత్రమైన అగ్నిలో నడుస్తూ లేదా దాని మీదుగా ప్రవేశిస్తూ దేవతా శక్తిని ప్రదర్శిస్తాడు. ఇది భక్తి , ధైర్యం ఇంకా ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఈ అగ్ని ప్రవేశం చేసే తెయ్యం కళారూపాన్ని ‘కందనార్ కలన్’ అంటారు. ఎందుకంటే ఈ తెయ్యం సంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన దేవతా రూపాలలో ఒకటి కందనార్ కలన్. అదే అగ్నిప్రవేశ ఘట్టం. అతి శక్తివంతమైన ప్రదర్శన. ఇది ముఖ్యంగా అగ్నితో సంబంధం ఉన్న తెయ్యం రూపంగా ప్రసిద్ధి చెందింది. 

అ అగ్ని ప్రవేశ ఘట్టం ఎలా జరుగుతుంది? ఈ కందనార్ కలన్ ఎవరు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తెయ్యం అనేది ఆధ్యాత్మికతతో కూడుకున్న ఓ కళారూపం. ఈ సంప్రదాయంలో దేవతల కథలు, పురాణాలు మరియు స్థానిక వీరుల గాథలు నృత్యం, ఇంకా వేషధారణ ద్వారా ప్రదర్శించబడతాయి. తెయ్యం సంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన రూపాలలో ఒకటి కందనార్ కలన్. ఇది ముఖ్యంగా అగ్నితో సంబంధం ఉన్న తెయ్యం రూపంగా ప్రసిద్ధి పొందింది. పూర్తి తెయ్యం కళారూపాల్లో కందనార్ కలన్ తెయ్యం ప్రదర్శన ప్రధానమైనది. ఇందులో అత్యంత ఉత్కంఠభరితమైన భాగం అగ్ని ప్రవేశం. 

ఈ కందనార్ కలన్ ఎవరు?

‘కందనార్ కేలన్’ లేదా ‘కందరాన్ కలన్’ చరిత్రకు ఆధారంగా రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఆధ్యాత్మిక పరమైనది, మరో కథ సామాజిక పరమైనది.

ఆధ్యాత్మిక కథ

కందనార్ కేలన్ అనే యువకుడు ఒక సాధారణ గిరిజన రైతు (వాయనాడ్ కులవన్‌గా కూడా పిలుస్తారు). అతను జీవనోపాధి కోసం అడవిని చదును చేసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. కేలన్ అడవిలోని పొదలను, గడ్డిని తొలగించడానికి నిప్పు పెడతాడు. అయితే దురదృష్టవశాత్తు, ఆ గాలికి మంటలు వేగంగా వ్యాపించి అడవి మొత్తం దహనం కావడం మొదలవుతుంది. మంటల మధ్య చిక్కుకున్న కేలన్ తప్పించుకోవడానికి మార్గం లేక ఒక పెద్ద చెట్టుపైకి ఎక్కుతాడు. కానీ ఆ చెట్టుపై రెండు విష సర్పాలు (కాళరాత్రి మరియు కారుతనేరి) ఉంటాయి. ఒకవైపు భయంకరమైన మంటలు, మరోవైపు విష సర్పాలు—కేలన్ ప్రాణాలు కాపాడుకోలేని స్థితిలో పడిపోతాడు.

మంటలు చెట్టును కూడా దహించివేయడంతో, కేలన్ ఆ సర్పాలతో సహా అగ్నిలో కలిసిపోతాడు. ఆ సమయంలో వేట కోసం అడవికి వచ్చిన వాయనాడ్ కులవన్ (శివుని అంశగా భావించే దైవం) ఈ దృశ్యాన్ని చూస్తాడు. కేలన్ ధైర్యానికి, అతని నిస్సహాయ స్థితికి కరిగిన వాయనాడ్ కులవన్, తన విల్లుతో మంటలను ఆర్పి, కేలన్‌కు పునర్జన్మ ప్రసాదించి అతనికి దైవత్వాన్ని ఇస్తాడు.

కందనార్ కలన్ అనేది తెయ్యంలో ఒక దేవతా రూపం లేదా వీరుడి ఆత్మగా భావించబడుతుంది. ప్రజల నమ్మకం ప్రకారం, కందనార్ కలన్ ఒక ధైర్యవంతుడైన వ్యక్తి. అతను అగ్ని మీద నడిచే శక్తి కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. తెయ్యం కథల ప్రకారం అతను సమాజంలో అన్యాయం మరియు కుల వివక్షను ఎదుర్కొన్నాడు. అతని ధైర్యం మరియు ఆధ్యాత్మిక శక్తి కారణంగా తరువాత కాలంలో దేవతా రూపంగా పూజించబడటం ప్రారంభమైంది.

కందనార్ కలన్ సామాజిక కథ

సామాజిక గాథల ప్రకారం, కందనార్ కలన్ తక్కువ వర్గానికి చెందిన ఒక కుటుంబంలో జన్మించాడు. అయినప్పటికీ అతనికి గొప్ప ధైర్యం మరియు అసాధారణ శక్తి ఉండేది. తన వర్గం వారి రక్షణకు అతను పోరాటాలు చేస్తుండేవాడు. ఇది చూసి తట్టుకోలేని శత్రువులు ఒక సందర్భంలో అతని శక్తిని పరీక్షించడానికి ఒక పెద్ద అగ్నికుండం సిద్ధం చేశారు. అతను ఆ అగ్నిలోకి ప్రవేశించి సురక్షితంగా బయటకు వచ్చాడని కథ చెబుతుంది. ఈ సంఘటన తరువాత అతను అగ్ని దేవతకు సమానమైన శక్తి కలిగిన వ్యక్తిగా భావించబడ్డాడు. ఈ సంఘటన తరువాత ప్రజలు అతన్ని దేవతగా గౌరవించడం ప్రారంభించారు. 

అగ్ని ప్రవేశం అంటే ఏమిటి?

అగ్నిప్రవేశం అంటే అగ్ని లేదా మంటలు మధ్యగా తెయ్యం ప్రదర్శన కారుడు ప్రవేశించడం లేదా మంటలపై నడవడం. తెయ్యం ఆచారంలో ఇది దేవతకు అంకితమైన పవిత్ర కార్యక్రమం. ఈ కర్మలో పాల్గొనే వ్యక్తి తాను దేవత అవతారంగా భావించి అగ్ని మీద నడుస్తాడు. భక్తులు నమ్మకం ప్రకారం, ఈ సమయంలో దేవతా శక్తి ఆ వ్యక్తిలో ప్రవేశిస్తుంది కాబట్టి అగ్ని అతనికి హాని చేయదని భావిస్తారు.

తెయ్యం లో అగ్ని ప్రవేశం ఎలా జరుగుతుంది? 

అగ్ని ప్రవేశం అనేది తెయ్యం ఆచారంలో జరిగే పవిత్ర అగ్ని కర్మ. ఇందులో ప్రదర్శకుడు దేవతా శక్తితో అగ్నిపై నడుస్తాడని భక్తులు నమ్ముతారు. తెయ్యం ప్రదర్శనలో ఈ కార్యక్రమం అత్యంత ఉత్కంఠభరితమైనదిగా మరియు పవిత్రమైన భాగంగా పరిగణించబడుతుంది.

ఈ తెయ్యం ప్రదర్శకుడు భారీ అలంకరణలు, ప్రత్యేకమైన ఎరుపు రంగుతో కూడిన వేషధారణ అలాగే తలపాగా ధరించి దేవత రూపాన్ని తీసుకుంటాడు. ప్రదర్శన ప్రారంభానికి ముందు పూజలు, డప్పుల వాయిద్యాలు, మంత్రోచ్చారణలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో భాగంగా నేలపై పెద్ద అగ్నికుండం లేదా మంటల పొర తయారు చేస్తారు. తెయ్యం ప్రదర్శకుడు భక్తి భావంతో ఆ అగ్నిలో నడుస్తాడు లేదా మంటల మధ్యగా ప్రవేశిస్తాడు. ఈ ప్రక్రియలో దేవతా శక్తి ప్రదర్శకుడిని రక్షిస్తుంది కాబట్టి అగ్ని అతనికి హాని చేయదు అనేది భక్తుల నమ్మకం. ఇలా అగ్నిప్రవేశం ముగిశాకాక అగ్ని శక్తి కలిగిన ఆ వ్యక్తి  భక్తులకు ఆశీర్వాదం ఇస్తారు. 

అగ్ని ప్రవేశం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

కందనార్ కలన్ తెయ్యం కేవలం ఒక కళారూపం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక సందేశాన్ని కూడా ఇస్తుంది. ధైర్యం, భక్తి, సమానత్వం, న్యాయం, ఇంకా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం వంటి అంశాలు ఈ తెయ్యంలో ప్రతిబింబిస్తారు. ఈ కారణంగా కందనార్ కలన్ తెయ్యం ప్రజల మధ్య గొప్ప గౌరవం పొందింది. ఇప్పటికీ కులమత, ప్రాంత విబేధాలు లేకుండా ఈ కందనార్ కలన్ తెయ్యం చూసేందుకు భక్తులు తరలి వస్తారు. దైవత్వం పొందిన ప్రదర్శనకారుడి ఆశీర్వాదాలు తీనుకుంటారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *