దక్షిణాది సంప్రదాయంలోనే పూజలు జరిపే అయోధ్య ఆలయాలు

 

అయోధ్యలో దక్షిణ భారత సంప్రదాయ విధానంలో పూజలు జరిపే ఆలయాలు రెండున్నాయి. ఈ సంప్రదాయం వందేళ్లకు పైబడి కొనసాగుతుండటం విశేషం.

సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో దాదాపు 5,000 ఆలయాలున్నాయి. తెల్లవారుజామునుంచే శ్రీరామ భక్తుల సందడి మొదలవుతుంటుంది. ఇక్కడి మందిరాల్లో అనేక విశిష్టతలుంటాయి. వీటిలో దక్షిణ భారత సంప్రదాయ విధానంలో పూజలు జరిపే ఆలయాలు రెండున్నాయి. అవే విజయ రాఘవ్‌రామ్‌ మందిర్‌, అమ్మాజీ మందిర్‌లు. వీటికి వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. 

అమ్మాజీ మందిర్

అమ్మాజీమందిర్ గర్భగుడిలో దేవునిపై కృత్రిమ కాంతిని పడనివ్వరు. అంటే విద్యుత్తు లైట్లే ఉండవు. ఏళ్ల తరబడి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. మూలవిరాట్‌ ఉండే గర్భగుడిని మాతృగర్భంగా భావిస్తారు. ఇక్కడి మూలవిరాట్‌పై కూడా కృత్రిమ కాంతి పడకూడదన్న ఆచారం కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఇక్కడి ఆలయంలో విద్యుత్తు పంపుల ద్వారా వచ్చే నీటిని కూడా వాడరు. బావిలోంచి తోడిన నీటిని మాత్రమే వినియోగిస్తారు. ఉత్సవాల్లో అలంకరణ సమయంలో కూడా విద్యుత్తు బల్బులను వాడరు. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణ మూర్తులను ప్రత్యేకంగా ఊరేగిస్తుంటారు.

విజయ రాఘవ్ మందిర్

విజయ రాఘవ్‌ రామ్‌ మందిర్‌లోనూ మూలవిరాట్‌పై లైటింగ్‌ పడనివ్వరు. కృత్రిమ కాంతి(లైటింగ్‌) శ్రీరాముడిపై పడటం మంచిది కాదని భావిస్తారు. 1904లో నిర్మించిన ఈ ఆలయంలో గత 15 ఏళ్లుగా అఖండ రామనామ సంకీర్తన నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ కూడా బావిలోంచి తోడితీసిన నీటినే వినియోగిస్తుంటారు.

త్రేతానాధ్ ఆలయం

అయోధ్యలోని విశిష్ట మందిరాల్లో త్రేతానాథ్‌ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని భక్తుల కోసం నెలలో రెండు రోజులు మాత్రమే తెరుస్తారు. ఏకాదశి రోజుల్లోనే దర్శనం ఉంటుంది. అయితే నిత్య పూజలు మాత్రం వంశపారంపర్య కుటుంబం నిర్వహిస్తుంటుంది. రద్దీ ఎక్కువైతే ఆలయం పాడవుతుందని భావించడంవల్లే పూర్వకాలం నుంచీ ఇదే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.

లక్ష్మణకోట 

అయోధ్యలో లక్ష్మణుడికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. దీన్నే లక్ష్మణకోటగా పిలుస్తారు. ఇక్కడ లక్ష్మణుడికి శేషావతారంలో పూజలు జరుపుతారు. 150 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *