శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యాన యోగము (ఆత్మసంయమ యోగము)

శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యాన యోగము (ఆత్మసంయమ యోగము) లోని 47 శ్లోకాలను ఈ వీడియోలో పారాయణ చేయండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులవ్వండి. అదే విధంగా అ అధ్యాయంలోని శ్లోకాలను రోజుకు నాలుగు వంతున డైలీ గీత ప్రాజెక్టు లో భాగంగా మా Bhakti Saram YouTube ఛానెల్లో షార్టు వీడియోల రూపంలో పోస్టు చేస్తున్నాము. ప్రతీ రోజూ గీతా పారాయణ చేయండి.

శ్రీభగవానువాచ |

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |
స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః || ౧ ||

కర్మ ఫలితాన్ని ఆశ్రయించకుండా (కోరకుండా), ఏది తన కర్తవ్యమో (చేయవలసిన పని) అట్టి కర్మను ఎవడైతే చేస్తాడో.. అతడే సన్యాసి మరియు అతడే యోగి. కేవలం యజ్ఞాగ్నిని వదిలేసినవాడు (నిరగ్నిః) కానీ, పనులు మానేసినవాడు (అక్రియః) కానీ సంన్యాసి/యోగి కాలేడు.

యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ |
న హ్యసంన్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన || ౨ ||

దేనిని ‘సంన్యాసం’ అని పిలుస్తారో, దానినే ‘యోగం’ అని కూడా తెలుసుకో ఓ పాండవా! ఎందుకంటే, లౌకిక కోరికలను (సంకల్పాలను) వదులుకోనివాడు (అసంన్యస్త) ఎవడూ యోగి కాలేడు.

ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే || ౩ ||

యోగ స్థితిని అధిరోహించాలనుకునే (ఆరురుక్షోః) మునికి నిష్కామ కర్మ సాధనంగా (కారణంగా) చెప్పబడింది. అదే యోగ స్థితిని పొందిన (యోగారూఢస్య) వానికి ప్రశాంతత (శమః) సాధనంగా చెప్పబడింది.

యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే || ౪ ||

ఎప్పుడైతే మనిషి ఇంద్రియ విషయాల (రుచి, వాసన మొదలైనవి) యందు మరియు కర్మల యందు ఆసక్తిని (అనుషజ్జతే) కలిగి ఉండడో.. అట్టి అన్ని సంకల్పాలను వదిలేసినవాడిని ‘యోగారూఢుడు’ అని అంటారు.

ఉద్ధరేదాత్మనాఽఽత్మానం నాత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః || ౫ ||

తనను తాను ఉద్ధరించుకోవాలి (ఉద్ధరేత్), తనను తాను తక్కువ చేసుకోకూడదు (అవసాదయేత్). ఎందుకంటే మనకు మనమే మిత్రుడము (బంధుః) మరియు మనకు మనమే శత్రువులము (రిపుః).

బంధురాత్మాఽఽత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ || ౬ ||

ఎవరిచేత అయితే తన మనస్సు/ఆత్మ జయించబడిందో (జితః), వారికి తన ఆత్మే మిత్రుడు. కానీ మనస్సును జయించని వారికి (అనాత్మనః), ఆ ఆత్మే ఒక శత్రువులా ప్రవర్తిస్తుంది.

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః || ౭ ||

మనస్సును జయించిన వాడు, ప్రశాంతంగా ఉన్నవాడు.. చలి-వేడి (శీతోష్ణ), సుఖ-దుఃఖాలు మరియు మాన-అపమానాల యందు సమానంగా ఉంటాడు. అట్టివానిలో పరమాత్మ స్థిరంగా ఉంటాడు.

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః || ౮ ||

శాస్త్ర జ్ఞానము (జ్ఞాన) మరియు అనుభవ జ్ఞానము (విజ్ఞాన) తో తృప్తి చెందినవాడు, నిశ్చలంగా ఉన్నవాడు (కూటస్థః), ఇంద్రియాలను జయించినవాడు.. అట్టి యోగిని ‘యుక్తుడు’ (స్థిరమైన యోగి) అని అంటారు. ఇతడికి మట్టి గడ్డ (లోష్ట), రాయి (అశ్మ), బంగారం (కాంచన) అన్నీ సమానమే.

సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు |
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే || ౯ ||

మేలుకోరేవాడు (సుహృత్), స్నేహితుడు (మిత్ర), శత్రువు (అరి), తటస్థుడు (ఉదాసీన), మధ్యవర్తి (మధ్యస్థ), ద్వేషించదగినవాడు (ద్వేష్య), బంధువు (బంధు) మరియు పుణ్యాత్ములు (సాధుషు), పాపాత్ముల (పాపేషు) యందు కూడా ఎవరైతే సమబుద్ధిని (సమబుద్ధిః) కలిగి ఉంటారో.. అట్టివారే శ్రేష్ఠులు (విశిష్యతే).

యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః || ౧౦ ||

యోగి ఎల్లప్పుడూ (సతతమ్) ఒంటరిగా (ఏకాకీ), ఏకాంత ప్రదేశంలో (రహసి స్థితః) ఉంటూ.. మనస్సును, దేహాన్ని అదుపులో ఉంచుకుని (యతచిత్తాత్మా), ఎటువంటి ఆశలు లేనివాడై (నిరాశీః), ఏ వస్తువుల మీద మమకారం లేకుండా (అపరిగ్రహః) తన మనస్సును పరమాత్మ యందు నిలపాలి.

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || ౧౧ ||

పరిశుభ్రమైన ప్రదేశంలో (శుచౌ దేశే), తనకు అనుకూలమైన స్థిరమైన ఆసనాన్ని (స్థిరమాసనమ్) ఏర్పరుచుకోవాలి. అది మరీ ఎత్తుగా ఉండకూడదు (నాత్యుచ్ఛ్రితమ్), మరీ పల్లంగా ఉండకూడదు (నాతినీచమ్). దానిపై క్రమంగా కుశలు (దర్భలు), జింక చర్మము, వస్త్రము (చైలాజినకుశ) ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి.

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |
ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్ధయే || ౧౨ ||

ఆ ఆసనంపై కూర్చుని (ఉపవిశ్య), మనస్సును ఏకాగ్రం (ఏకాగ్రం మనః) చేసి, చిత్తమును మరియు ఇంద్రియాల క్రియలను అదుపులో ఉంచుకుని (యతచిత్తేంద్రియక్రియః).. తన ఆత్మశుద్ధి (ఆత్మవిశుద్ధయే) కోసం యోగ సాధన చేయాలి.

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ || ౧౩ ||

దేహము (కాయ), శిరస్సు (శిర), మెడ (గ్రీవము) మూడింటిని సమంగా (సమమ్), నిశ్చలంగా (అచలమ్) ఉంచి.. దిక్కులు చూడకుండా (దిశశ్చానవలోకయన్), తన ముక్కు కొనను (నాసికాగ్రమ్) చూస్తున్నట్లుగా (దృష్టిని నిలిపి) స్థిరంగా ఉండాలి.

ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః |
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః || ౧౪ ||

దేహము (కాయ), శిరస్సు (శిర), మెడ (గ్రీవము) మూడింటిని సమంగా (సమమ్), నిశ్చలంగా (అచలమ్) ఉంచి.. దిక్కులు చూడకుండా (దిశశ్చానవలోకయన్), తన ముక్కు కొనను (నాసికాగ్రమ్) చూస్తున్నట్లుగా (దృష్టిని నిలిపి) స్థిరంగా ఉండాలి.

యుంజన్నేవం సదాఽఽత్మానం యోగీ నియతమానసః |
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి || ౧౫ ||

ఈ విధంగా ఎల్లప్పుడూ (సదా) తన మనస్సును పరమాత్మ యందు నిలిపే నియత మనస్కుడైన (నియతమానసః) యోగి.. నా యందు ఉన్నట్టి (మత్సంస్థామ్) మరియు మోక్షమే అంతిమంగా గల (నిర్వాణపరమామ్) పరమ శాంతిని పొందుతాడు.

నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః |
న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున || ౧౬ ||

ఓ అర్జునా! అతిగా తినేవాడికి (నాత్యశ్నతః), అస్సలు తిననివాడికి (అనశ్నతః), అతిగా నిద్రపోయేవాడికి (అతిస్వప్నశీలస్య) మరియు అస్సలు నిద్రపోకుండా ఎప్పుడూ మేల్కొని ఉండేవారికి (జాగ్రతః) యోగము సిద్ధించదు.

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా || ౧౭ ||

ఆహారము, విహారము (విశ్రాంతి) నియమబద్ధంగా కలవాడు (యుక్త), కర్మలందు తగిన రీతిలో ప్రవర్తించేవాడు, తగినంత నిద్ర మరియు మేల్కొలుపు కలవాడికి.. యోగము దుఃఖాలను హరించేది (దుఃఖహా) అవుతుంది.

యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే |
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || ౧౮ ||

ఎప్పుడైతే చక్కగా నిగ్రహించబడిన మనస్సు (వినియతం చిత్తమ్) ఆత్మయందే స్థిరంగా ఉంటుందో, సమస్త కోరికల యందు నిరాశక్తుడై (నిస్పృహః) ఉంటాడో.. అప్పుడు అతడు ‘యుక్తుడు’ (యోగం సిద్ధించినవాడు) అని పిలువబడతాడు.

యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః || ౧౯ ||

గాలి లేని చోట ఉన్న దీపం (నివాతస్థో దీపః) ఎలాగైతే కదలదో (నేంగతే), ఆత్మధ్యానంలో నిమగ్నమైన నియత చిత్తము కల యోగి మనస్సు కూడా అలానే నిశ్చలంగా ఉంటుంది.

యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |
యత్ర చైవాత్మనాఽఽత్మానం పశ్యన్నాత్మని తుష్యతి || ౨౦ ||

యోగ సాధన ద్వారా నిరోధించబడిన చిత్తము ఎక్కడైతే ప్రశాంతతను పొందుతుందో, ఎక్కడైతే తన శుద్ధమైన బుద్ధి చేత ఆత్మను దర్శిస్తూ తనలోనే తాను తృప్తిని (తుష్యతి) పొందుతాడో.. (అదే యోగ స్థితి).

సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః || ౨౧ ||

ఇంద్రియాలకు అందక కేవలం పరిశుద్ధమైన బుద్ధికే అందే అనంతమైన సుఖాన్ని (ఆత్యంతికం సుఖమ్) ఎక్కడైతే పొందుతాడో, అట్టి స్థితిలో స్థిరంగా ఉన్న యోగి పరమ సత్యం నుండి ఎన్నటికీ చలించడు.

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే || ౨౨ ||

ఏ స్థితిని పొందిన తర్వాత అంతకంటే గొప్ప లాభం మరొకటి లేదని భావిస్తాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు గొప్పదైన దుఃఖం (గురుణాపి దుఃఖేన) కూడా అతడిని చలింపజేయదో.. (అదే యోగం).

తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ |
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా || ౨౩ ||

దుఃఖంతో కూడిన సంసార సంబంధం నుండి విడదీయబడిన దానినే (వియోగం) ‘యోగం’ అని తెలుసుకో. అట్టి యోగాన్ని విసుగు చెందని మనస్సుతో (అనిర్విణ్ణచేతసా), నిశ్చయమైన పట్టుదలతో సాధించాలి.

సంకల్పప్రభవాన్ కామాంస్త్యక్త్వా సర్వానశేషతః |
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః || ౨౪ ||

సంకల్పాల వల్ల పుట్టిన కోరికలన్నింటినీ (సంకల్పప్రభవాన్ కామాన్) పూర్తిగా (అశేషతః) వదిలివేసి, మనస్సు ద్వారానే ఇంద్రియ సమూహాన్ని (ఇంద్రియగ్రామమ్) అన్ని వైపుల నుండి నియంత్రించాలి.

శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ || ౨౫ ||

ధైర్యంతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా (శనైః శనైః) ఉపశాంతిని పొందాలి. మనస్సును ఆత్మయందే నిలిపి (ఆత్మసంస్థం మనః కృత్వా), ఆ సమయంలో వేరే దేనినీ ఆలోచించకూడదు.

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ || ౨౬ ||

చంచలమైనది, అస్థిరమైనది అయిన మనస్సు ఎక్కడికెక్కడికి పారిపోతుందో (యతో యతో నిశ్చరతి), అక్కడి నుండి దానిని మళ్ళించి (నియమ్య), తిరిగి ఆత్మవశం చేయాలి.

ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ |
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ || ౨౭ ||

ప్రశాంతమైన మనస్సు కలవాడు, రజోగుణం అణిగిపోయినవాడు (శాంతరజసమ్), పాప రహితుడు (అకల్మషమ్) మరియు బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఉత్తమమైన సుఖం లభిస్తుంది.

యుంజన్నేవం సదాఽఽత్మానం యోగీ విగతకల్మషః |
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే || ౨౮ ||

ఈ విధంగా ఎల్లప్పుడూ తనను తాను పరమాత్మతో అనుసంధానం చేసే పాపరహితుడైన యోగి, బ్రహ్మజ్ఞానము అనే అనంతమైన సుఖాన్ని (అత్యంతం సుఖమ్) సులభంగా పొందుతాడు.

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || ౨౯ ||

యోగముతో కూడిన మనస్సు కలవాడు, అంతటా సమదృష్టి కలవాడు (సర్వత్ర సమదర్శనః).. తనను అన్ని ప్రాణులలోనూ (సర్వభూతస్థమ్), అన్ని ప్రాణులను తనలోనూ చూస్తాడు.

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || ౩౦ ||

నన్ను అంతటా చూసేవాడు, అన్నింటినీ నాలో చూసేవాడు.. అతడికి నేను ఎన్నడూ దూరమవ్వను (న ప్రణశ్యామి), అతడు నాకు ఎన్నడూ దూరం కాడు.

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః |
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే || ౩౧ ||

అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అభేద భావంతో (ఏకత్వమ్) ఎవరు భజిస్తారో, అట్టి యోగి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా యందే ఉంటాడు.

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున |
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః || ౩౨ ||

ఓ అర్జునా! తనను తాను ఉదాహరణగా తీసుకుని (ఆత్మోపమ్యేన), ఇతరుల సుఖదుఃఖాలను కూడా తన సుఖదుఃఖాల వలెనే ఎవరైతే సమానంగా చూస్తారో.. అట్టి యోగి అందరికంటే శ్రేష్ఠుడని నా అభిప్రాయం.

అర్జున ఉవాచ |

యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన |
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ || ౩౩ ||

అర్జునుడు ఇలా పలికాడు: “ఓ మధుసూదనా! నీవు చెప్పిన ఈ సమత్వ యోగము (సామ్యేన యోగః) ఏదైతే ఉందో, మనస్సు యొక్క చంచల స్వభావం (చంచలత్వాత్) వల్ల దానికి స్థిరమైన స్థితిని నేను చూడలేకపోతున్నాను.”

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ || ౩౪ ||

“ఓ కృష్ణా! మనస్సు చాలా చంచలమైనది (చంచలమ్), ఇంద్రియాలను కలచివేసేది (ప్రమాథి), బలమైనది మరియు మొండిది (బలవత్ దృఢమ్). దానిని అదుపు చేయడం గాలిని బంధించడం కంటే కష్టమని (సుదుష్కరమ్) నేను భావిస్తున్నాను.”

శ్రీభగవానువాచ |

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || ౩౫ ||

శ్రీకృష్ణుడు ఇలా పలికాడు: “ఓ మహాబాహో! మనస్సును అదుపు చేయడం కష్టమే అన్నది నిస్సందేహం (అసంశయమ్). కానీ, ఓ కౌంతేయా! అభ్యాసము (అభ్యాసేన) మరియు వైరాగ్యము (వైరాగ్యేణ) చేత అది నిగ్రహించబడుతుంది.”

అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః |
వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః || ౩౬ ||

మనస్సును నిగ్రహించని వానికి యోగము సిద్ధించడం కష్టమని నా అభిప్రాయం. కానీ, మనస్సును వశం చేసుకుని ప్రయత్నించే వాడు ఉపాయం ద్వారా దానిని సాధించగలడు.

అర్జున ఉవాచ |

అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి || ౩౭ ||

అర్జునుడు ఇలా అడిగాడు: “ఓ కృష్ణా! శ్రద్ధతో కూడినవాడై (శ్రద్ధయోపేతః) యోగ సాధన మొదలుపెట్టి, మనస్సును నిగ్రహించలేక (అయతిః), యోగ మార్గం నుండి చలించినవాడు (యోగాచ్చలితమానసః).. యోగ సిద్ధిని పొందలేక ఎటువంటి గతిని పొందుతాడు?”

కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి || ౩౮ ||

ఓ మహాబాహో! బ్రహ్మ మార్గంలో (బ్రహ్మణః పథి) దిక్కుతోచక, అస్థిరంగా ఉన్న అట్టి యోగ భ్రష్టుడు.. ఇటు కర్మ ఫలాలు (స్వర్గాది సుఖాలు), అటు యోగ ఫలం (మోక్షం) రెండింటినీ కోల్పోయి (ఉభయ విభ్రష్టః), విడిపోయిన మేఘంలా (ఛిన్నాభ్రమ్ ఇవ) నశించిపోతాడా?

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః |
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే || ౩౯ ||

ఓ కృష్ణా! నా ఈ సందేహాన్ని (ఏతన్ మే సంశయమ్) పూర్తిగా (అశేషతః) తొలగించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను. ఈ సందేహాన్ని నివృత్తి చేయగలవాడు నీకంటే వేరొకడు (త్వదన్యః) ఎవరూ లేరు.

శ్రీభగవానువాచ |

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |
న హి కళ్యాణకృత్ కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి || ౪౦ ||

శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికాడు: “ఓ పార్థా! అట్టివానికి ఇటు ఇహలోకంలో కానీ (నైవేహ), అటు పరలోకంలో కానీ (నాముత్ర) వినాశనం లేదు. ఎందుకంటే నాయనా (తాత)! మంచిని చేసేవాడు (కల్యాణకృత్) ఎవడూ ఎన్నటికీ దుర్గతిని పొందడు.”

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః |
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే || ౪౧ ||

“యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందే లోకాలను పొంది, అక్కడ చాలా ఏళ్ళ పాటు (శాశ్వతీః సమాః) సుఖంగా ఉండి.. ఆ తర్వాత పవిత్రమైన ఆలోచనలు గల (శుచీనామ్), ఐశ్వర్యవంతులైన వారి ఇంట్లో (శ్రీమతాం గేహే) జన్మిస్తాడు.”

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ || ౪౨ ||

లేదా బుద్ధిమంతులైన యోగుల కుటుంబంలోనే (యోగినాం ధీమతాం కులే) జన్మిస్తాడు. లోకంలో ఇటువంటి జన్మ లభించడం అత్యంత దుర్లభమైనది (దుర్లభతరమ్)

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన || ౪౩ ||

ఓ కురునందనా! అట్టి జన్మలో అతడు తన పూర్వ జన్మకు సంబంధించిన బుద్ధి సంస్కారాలను (పౌర్వ దైహికమ్ బుద్ధి సంయోగమ్) పొందుతాడు. దాని ప్రభావంతో యోగ సిద్ధి కోసం మరలా ప్రయత్నిస్తాడు (యతతే చ భూయః)

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః |
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే || ౪౪ ||

తన పూర్వ జన్మ సాధన (పూర్వాభ్యాసేన) వల్ల అతడు వివశుడై కూడా యోగ మార్గం వైపు ఆకర్షించబడతాడు. యోగమును తెలుసుకోవాలనే ఆసక్తి కలవాడు (జిజ్ఞాసుః) కూడా వేదోక్త కర్మకాండలను (శబ్దబ్రహ్మను) దాటి ముందుకు వెళ్తాడు.

ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః |
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్ || ౪౫ ||

ప్రయత్నంతో సాధన చేసే యోగి, పాపాలను కడిగివేసుకుని (సంశుద్ధ కిల్బిషః), అనేక జన్మల తర్వాత సిద్ధిని పొంది, చివరకు పరమ గతిని (పరాం గతిమ్) పొందుతాడు.

తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః |
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || ౪౬ ||

యోగ సాధకుడు తపస్సు చేసేవారికంటే (తపస్విభ్యః), శాస్త్ర జ్ఞానం కలవారికంటే (జ్ఞానిభ్యః) మరియు ఫలాపేక్షతో కర్మలు చేసేవారికంటే (కర్మిభ్యః) శ్రేష్ఠుడు. కాబట్టి ఓ అర్జునా! నీవు యోగివి కావాలి.

యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా |
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః || ౪౭ ||

యోగీలందరిలోనూ ఎవరైతే తన అంతరాత్మను నా యందు నిలిపి (మద్గతేన అంతరాత్మనా), అచంచలమైన శ్రద్ధతో నన్ను భజిస్తారో.. అతడే శ్రేష్ఠుడైన యోగి (యుక్తతమః) అని నా అభిప్రాయం.

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే ధ్యానయోగో నామ షష్ఠోఽధ్యాయః || ౬ ||