365 వత్తుల దీపాారాధన : కార్తీకమాసంలో కార్తీక పౌర్ణమి నాటి దీపారాధన మాసానికే శ్రేష్ఠమైనది. ఎందుకంటే ఆరోజు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కావడంతో దీపానికి అంత ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో ఎన్ని దీపాలు వెలిగించి శివకేశవులను ఆరాధిస్తే అంత సౌభాగ్యం లభిస్తుంది. సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా 365 వత్తులతో దీపాన్ని వెలిగించి, ఆ దీపజ్యోతిలో శివకేశవులను ఆరాధిస్తే వారి అనుగ్రహానికి పాత్రులవుతారు. 365 వత్తులతో దీపారాధన చేసే ముందు ఈ శ్లోకం చదువుతూ దీపాన్ని వెలిగిస్తే దీపారాధన ఫలితం శివ కేశవులకు నేరుగా చేరుతుంది.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగీ
భవంతి త్వం శ్వపచా హి విప్రాః.
ఈ దీపాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వెలిగించాలి అంటే కార్తీకపౌర్ణమి నాడు ప్రదోష వేళలో వెలిగించాలి. సూర్యాస్తమయం తరువాత వచ్చే సుమారు 1 గంట 30 నిమిషాల కాలాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల ఆశించిన. ఐశ్వర్యం కలగాలంటే, శివకేశవుల అనుగ్రహం లభించాలంటే దీపాన్ని ఆవునెయ్యితో వెలిగించాలి. సకల దోష నివారణ, పాప పరిహారానికి నువ్వుల నూనెతో 365 వత్తుల దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని మన ఇంటి ముందు తులసి కోట వద్ద కానీ, దేవాలయాల్లోనూ, నదీతీరాల్లోను సముద్రతీరంలో కానీ వెలిగించాలి.

