కార్తీకమాసం లో పాటించాల్సిన విధులు ఏమిటి?

కార్తీకమాసంలో మనం చేసే పూజలు , వెలిగించే దీపాలు, చేసే నదీస్నానాల పుణ్య ఫలం పూర్తిగా దక్కాలని కోరుకుంటాం కదా మనందరం. కార్తీకమాసంలో మనం చేసే పూజలకు పరిపూర్ణత లభించాలంటే ఈ 5 విధులు  తప్పక నిర్వర్తించాలి. ఇవి చేయకపోతే మాసంలో చేసే పూజల ఫలితం పూర్తిగా దక్కదని శాస్త్రగ్రంధాలు చెబుతున్నాయి. అవేంటో  తెలుసుకుందాం.

1. ఉసిరి దీప దానం

కార్తీకమాసం లో ఉసిరికాయకు, ఉసిరి చెట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఉసిరిలో కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రత్యేకించి కార్తీకమాసంలో ఉసిరి దీపం దానం చెయ్యాలి

2. పిండి దీపదానం

కార్తీకమాసం లో పిండి దీపదానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. బియ్యప్పిండితో చేసిన దీపం శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనది. కార్తీక్ దామోదరునికి అత్యంత ఇష్టమైనది కాబట్టి ముఖ్యంగా కార్తీక మాసంలో పిండి దీపదానానికి ఎంతో విశిష్టత ఉంది. బియ్యపు పిండిని బెల్లం, నీటితో కలిపి, ప్రమిద ఆకారంలో తయారు చేయాలి. ఆ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి దానం చెయ్యాలి.

3. సాలగ్రామ దానం

కార్తీకమాసంలో చేసే సాలగ్రామ దానం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. సాలగ్రామం అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపం. గండకీ నదిలో లభించే ఈ పవిత్ర శిలను పూజించడం, సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో పూజించి, పంచామృతాలతో అభిషేకం చేసి, వస్త్రం, దక్షిణ, తాంబూలాలతో సహా సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి. మనం చేసే కార్తీక పూజలకు పరిపూర్ణత లభించాలంటే, విష్ణు స్వరూపమైన ఈ సాలగ్రామ దానాన్ని ప్రతి ఒక్కరూ తమ శక్తికొలది విధిగా నిర్వర్తించాలి.

4. 365 వత్తులు వెలిగించడం

కార్తీకమాసంలో ఏ ఒక్కరోజైనా 365 వత్తులను వెలిగించడం వల్ల, సంవత్సరంలోని 365 రోజులు దీపారాధన చేసినంత పుణ్యఫలం మనకు దక్కుతుంది. ఏడాది పొడవునా తెలియక చేసిన పూజా లోపాలన్నీ తొలగిపోతాయి. కార్తీకమాస పూజలకు సంపూర్ణ ఫలితం దక్కాలంటే ప్రతి ఒక్కరూ ఈ విధిని తప్పకుండా చేయాలి.

5. స్వయంపాక దానం లేదా తాంబూల దానం

కార్తీకమాసంలో చేసే పూజలన్నింటి ఫలితం మనం చేసే దానాలను బట్టే ఉంటుంది. ఏ పూజ అయినా సరే, మనం చేసే దానంతోనే పరిపూర్ణం అవుతుంది.  ఒక బ్రాహ్మణుడు ఒక రోజు వండుకోవడానికి సరిపడా బియ్యం, పప్పులు, కూరగాయలు, నెయ్యి, ఉప్పు, పెరుగు వంటి నిత్యావసర సరుకులను స్వయంపాక రూపకంగా దానం చేయాలి. ఒకవేళ స్వయంపాక దానం చేయడం వీలుకాని వారు, కనీసం మూడు తమలపాకులు, వక్క, రెండు అరటి పళ్ళు  యథాశక్తిగా దక్షిణలతో కూడిన తాంబూలాన్ని భక్తితో సమర్పించాలి. దక్షిణ ఇవ్వడంలో లోభత్వం చూపరాదు.

స్వయంపాక దానం విశిష్టత

కార్తీకమాసంలో చేసే స్వయంపాక దానం వల్ల అన్నదాన ఫలం, ఆతిథ్య పుణ్యం లభిస్తాయి. తాంబూల దానం శుభానికి, సంపూర్ణత్వానికి చిహ్నం. మనం నెలంతా చేసిన పూజల్లో ఏవైనా లోపాలు ఉన్నా, ఈ దానం వాటిని సరిదిద్ది, ఆ పూజల ఫలితాన్ని మనకు దక్కేలా చేస్తుంది.

కార్తీక మాసంలో కేవలం దీపాలు వెలిగించడం, నదీస్నానాలు చేయడమే కాదు, సంపూర్ణ పూజా విధుల నిర్వహించడం, దానధర్మాలు చేయడం వంటి వాటితోనే పూజలకు పరిపూర్ణత లభిస్తుంది.