షణ్ముగన్ ఆలయం: విభిన్న నిర్మాణశైలితో భక్తులను ఆకట్టుకుంటున్న షణ్ముగన్ టెంపుల్

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయి. వాటితోపాటు ప్రముఖ ఆలయాలు కూడా ఉన్నాయి. బెంగుళూరు మహానగరంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి శృంగేరీ శారదాపీఠం నిర్వహణలో శ్రీ భారతీతీర్థస్వామి పర్యవేక్షణలో నిర్మింపబడ్డ శృంగేరీ శ్రీ షణ్ముగ  దేవాలయం. ఈ ఆలయం నరగరంలో ఒక ప్రత్యేక ఆలయంగా నిలుస్తుంది. 

భూమట్టం నుంచి సుమారు 240 అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయం శిఖరాన ఆరు దిక్కులను చూస్తూ, ఆరుముఖాల షణ్ముఖ స్వామి కొలువుదీరి ఉన్నారు. ఈ షణ్ ముఖాల ఎత్తు 120 అడుగులు. నక్షాత్రాకారంలో నిర్మించబడ్డ ఈ ఆలయం ఎన్నో ప్రాధాన్యతలను సంతరించుకుంది.

సుందరమైన క్రిష్టల్ డోమ్ 

ఆలయం పైన 42 అడుగుల క్రిష్టల్ డోమ్ నిర్మించారు. దీనిమీద 2500 క్రిష్టల్స్ ను అమర్చారు. 16 రంగులతో వెలిగే ఎల్ ఈడీ దీపాల కాంతిలో రాత్రివేళ ఈ డోమ్ సర్వాంగసుందరంగా కనిపిస్తుంది. 2006లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. డాక్టర్ ఆర్.అరుణాచలం అనే ఒక ఆర్కిటెక్ట్ ఈ ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు.

ప్రకృతి సౌందర్యం మధ్య ఆలయం

బెంగుళూరులోని రాజరాజేశ్వరీనగర్ లో ఉండే ఈ ఆలయం విశాలమైన ప్రాకారాలతో, ప్రకృతి సౌందర్యంతో విరాజిల్లుతోంది. గర్భగుడిలో వేంచేసియున్న షణ్ముఖుని దర్శించుకోవాలంటే సుమారు 150 నుంచి 200 మెట్లు ఎక్కివెళ్ళాలి. దారి పొడవునా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆవాసాలైన పుట్టల ఆకృతిలో ఎర్రటి నిర్మాణాలు మనకు దర్శనమిస్తాయి. 

ఆలయంపైన సోలారు ట్రాకర్లను ఏర్పాటు చేశారు. ఇవి సూర్యగమనాన్ని బట్టి కదులుతూ షణ్ముఖుని మీద సూర్యకిరాణాలను ప్రసరింపచేస్తాయని స్థానికులు చెబుతున్నారు. విభిన్నమైన నిర్మాణశైలి కలిగిన ఈ ఆలయం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. బెంగుళూరు సిటీ సెంటర్ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. బెంగుళూరు ప్రధాన రైల్వేస్టేషన్, మెట్రో స్టేషన్ అయిన మెజిస్టిక్ కు రాజరాజేశ్వరీనగర్ మెట్రోస్టేషన్ 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడినుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ షణ్ముగ ఆలయం నెలకొని ఉంది. రాజరాజేశ్వరీనగర్ మెట్రోస్టేషన్ పర్పుల్ లైన్ లో ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *