శ్రీవారికి 365 రోజుల్లో 450పై ఉత్సవాలు

 

భక్తజనప్రియుడు, ఆశ్రితకల్పతరువు, కోరిన వరాలిచ్చే కోనేటిరాయుడైన శ్రీ వేంకటేశుడు వెలసివున్న తిరుమల దివ్యక్షేత్రంలో అన్నీ అద్భుతాలే. 

”స్మరణాత్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్‌” అని స్వామిని తలంచిన అన్ని పాపాలు హరించబడుతాయి, కోరికలు ఈరేడుతాయి, ముక్తి సంప్రాప్తిస్తుంది అన్నది శ్రీవారి భక్తుల ప్రగాఢ విశ్వాసం. కమలాక్షు వీక్షించు కన్నులు కన్నులు.

ఉత్సవాలిలా…

నిత్య కల్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధి గాంచిన వేంకటాచలంలో ప్రతిరోజూ ఉత్సవమే. 

నిత్యోత్సవాలు

సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామార్చన.

వారోత్సవాలు

అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం.

నక్షత్రోత్సవాలు

రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రాలు వచ్చినరోజున చేసే ప్రత్యేక పూజలు.

సంవత్సరోత్సవాలు

కోయిలాళ్వార్‌ తిరుమంజనం, ఉగాది ఆస్థానం, తెప్పోత్సవం, పద్మావతి పరిణయం, జేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం 

తిరుమల శ్రీవారికి ప్రతిరోజూ ఓ పండుగే

ప్రతిరోజూ ఒక పండుగగా, ప్రతిపూటా పరమాన్నభరిత నివేదనలతో,  ఏడు కొండలవాడు ఏడాది పొడవునా పూజలందుకుంటూ ఉత్సవాల దేవునిగా,  ఆరాధింపబడుతున్నాడు.

సంవత్సరానికి ఉన్నవి 365 రోజులే కాని కొండలరాయునికి ఉత్సవాలు 450 కి పైమాటే అంటే అతిశయోక్తిలేదు. అలంకార ప్రియుడైన శ్రీహరి వైభవాన్ని తిలకింప వేయికన్నులైనా చాలవు. స్వామివారి ఉత్సవమూర్తియైన శ్రీ మలయప్ప తన ఉభయదేవేరులైన శ్రీభూదేవీలతో కూడి సర్వాంగసుందరంగా అలంకృతుడై తిరు ఉత్సవాలలో పాల్గొంటూ తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *