సప్తమాతృకలు ఏయే శక్తి దేవతలు?

ఆ పరాశక్తియే సప్తమాతృకలుగా అవతరించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతల శక్తులే సప్తమాతృకలు. సర్వదేవతలూ శక్తిస్వరూపాలేనని  స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.

బ్రహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి దేవతలను సప్త మాతృకలు అంటారు. దేవీ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, స్కంద పురాణం సప్తమాతృకల ఆవిర్భావం, వాటి విశిష్టతను గురించి పేర్కొన్నాయి. 

1.బ్రహ్మాణి

ఈ మాతృమూర్తి బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి.

2.మహేశ్వరి

ఈ మాత శివుని శక్తి. శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.

3.కౌమారి

ఈమె కుమారస్వామి శక్తి.  శక్తి (బల్లెం) హస్త. మయూర వాహనారూఢ.

4. వైష్ణవి

విష్ణుశక్తి. శ్రిమాహావిష్ణువువలె గరుడవాహనాన్ని అధిరోహించి, చేతులలో శంఖ చక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.

5. వారాహి

హరి అవతారమైన యజ్ఞవరాహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.

6. నారసింహి

విష్ణువు ధరించిన నరసింహావతార శక్తి. సింహముఖంతో, నరదేహంతో, అగ్నిమయకాంతితో దివ్యంగా ప్రకాశించే జనని.

7. ఐంద్రీ

ఇంద్రశక్తి. ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.

సర్వదేవతలు అమ్మ రూపాలే. జగదంబ రాక్షససంహారం చేస్తుండగా, సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమెకు సహకరించాయి.

సప్తమాతృకల ఆవిర్భావ వృత్తాంతం

పూర్వం జగన్మాత రాక్షసులతో పోరాడుతున్న సమయంలో రాక్షసుల మాయవల్ల తిరిగి అవిర్భవిస్తూ వస్తున్న రాక్షసుల సంహారం కోసం దేవతలు వారి లోని అమ్మవారి శక్తి రూపాలను అమ్మవారికి సహాయంగా యుద్ధానికి పంపుతారు. 

ఏ శక్తి రూపం ఏ దేవత నుండి ఆవిర్భవించింది?

  • బ్రహ్మ పంపిన బ్రహ్మణి హంస వాహనంపై
  • విష్ణుమూర్తి పంపిన వైష్ణవి గరుడ వాహనం పై 
  • కుమార స్వామి పంపిన కౌమారీ నెమలి వాహనం పై 
  • వరాహమూర్తి పంపిన వారాహి మహిష వాహనం పై    
  • ఇంద్రుడు పంపిన ఇంద్రాణి ఐరావతం పై 
  • యముడు పంపిన చాముండి శవ వాహనం పై
  • విష్ణువు పంపిన నారసింహి సింహవాహనంపై యుద్ధరంగానికి చేరుకున్నారు.

     సర్వంశక్తిమయం. దుష్ట సంహారం చేసి లోకాలను కాపాడిన జగన్మాత స్వరూపాలే ఈ సప్త మాతృకలు!   ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకూ మనం జరుపుకునే దసరా నవరాత్రులలో ఈ శక్తి దేవతలను శరణువేడుకోవాలి.  మనలో మనకు తెలియకుండా ఉన్న కామ, క్రోధ,లోభ, మద, మాత్సర్యాల వంటి దుర్గుణాలను రూపుమాపి, మనల్ని సన్మార్గంలో నడిపించమని ఆ తల్లిని ప్రార్ధించాలి.  చెడు నుండి మనల్ని కాపాడమని కోరుకోవాలి. మనం చిత్తశుద్ధితో ఆ జగన్మాతకు ప్రణమిల్లాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *