సెప్టెంబరు 19న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 19వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఉదయం 3.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం, ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా పూస్తారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 12.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
సెప్టెంబరు 19వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని పురస్కరించుకుని అష్టదళ పాదపద్మారాధన సేవను తితిదే రద్దు చేసింది.
Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *