శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ల‌క్షకుంకుమార్చ‌న‌

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో శనివారం శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. న‌వంబ‌రు 20 నుండి 28వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని ఈ కార్యక్రమం జరిపారు.

ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేశారు.

కుంకుమార్చన విశిష్ఠత

హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష‌ ప్రాధాన్యం ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. ల‌క్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలలాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు లక్షకుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *