
శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన
తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ కపిలేశ్వరాలయం ఆలయం శుక్రవారం “ఓం నమః శివాయ” పంచాక్షరీ మంత్ర ఘోషతో ప్రతిధ్వనించింది. భక్తుల హర హర మహాదేవ నామస్మరణల మధ్య స్వామివారికి లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా జరిగింది. ఆలయమంతా ఆధ్యాత్మిక శోభతో, దివ్య కాంతులతో విరాజిల్లింది.
ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ అభిషేకం, అలంకారం, అర్చన వైభవంగా నిర్వహించారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ భక్తిశ్రద్ధలతో కొనసాగింది. త్రిదళాలతో కూడిన పవిత్ర లక్ష బిల్వ పత్రాలతో వేద పండితులు, ఆలయ అర్చకులు ఆగమోక్తంగా స్వామివారిని అర్చించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వార్చనను కనులారా వీక్షించి భక్తులు పులకించిపోయారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ఉత్సవమూర్తుల పురవీధి ఊరేగింపు
సాయంత్రం 6 గంటలకు శ్రీ చంద్రశేఖర స్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులను పుష్పాలంకృతులను చేసి తిరుపతి పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మంగళవాయిద్యాలు, భజన బృందాల కోలాటాల నడుమ సాగిన ఈ ఊరేగింపును దర్శించి భక్తులు పులకించిపోయారు.

