శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారంనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.

ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేసారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని టిటిడీ నిర్వహించింది.

అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవలైన ఆష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. ఇతర ఆర్జిత సేవలు యధాతథంగా నిర్వహిస్తారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *