శ్రీరామచంద్ర ఉత్సవ మూర్తికి అంగుళీ సంధాన సంప్రోక్షణం

 

తిరుమల ఆలయంలో నవంబరు 20వ తేదీ బుధవారం ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వివరాల్లోకి వెళ్తే 2021 సంవత్సరంలో శ్రీరాముల వారి విగ్రహానికి సంబంధించిన ఎడమచేయి మధ్య వేలి భాగంలో చిన్నపాటి భిన్నం ఏర్పడినట్లు గుర్తించారు. అప్పట్లో ఈ వేలుకు బంగారు కవచాన్ని తొడిగి ఏర్పడిన భిన్నాన్ని సవరించమైనది.

సాధారణంగా ఇటువంటి చిన్నపాటి భిన్నాలు ఉత్సవమూర్తులకు ఏర్పడినప్పుడు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమంలో సవరించడం పరిపాటి.

అయితే మహా సంప్రోక్షణ కార్యక్రమం 2018లో టీటీడీ నిర్వహించింది. తదుపరి మహా సంప్రోక్షణ కార్యక్రమం 2030లో జరగనుంది. అందుకు ఐదు సంవత్సరాలకు పైగా సమయం ఉన్న కారణంగా జీయర్ స్వాములు, ఆగమ సలహాదారులు, అర్చకులతో కూడిన కమిటీ నిర్ణయించిన మేరకు చిన్నపాటి భిన్నాలను ఆగమోక్తంగా సవరించేందుకు మంగళ, బుధవారాల్లో శ్రీరాములవారి ఎడమ చేయి అంగుళీ సంధాన సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి టీటీడీ నిర్ణయించింది.

ఈ కార్యక్రమం ద్వారా ఉత్సవ విగ్రహాలకు ఎటువంటి దోషం ఉండదని కూడా కమిటీ తెలిపింది.

కాగా సంపంగి ప్రాకారంలో జరిగిన ఈ క్రతువుల్లో భాగంగా ముందుగా మంగళవారం రాత్రి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కళాపకర్షణ, బింబ వాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనాధివాసం పూజలు నిర్వహించారు.

అనంతరం బుధవారం ఉదయం ప్రత్యేక హోమం నిర్వహించి పూర్ణాహుతి, కళావాహన కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవ మూర్తి లో ఉన్న చిన్నపాటి భిన్నాన్ని శాస్త్రోక్తంగా సవరించడమైనది.

తిరుమల జీయర్ స్వామీజీల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తిరుమల ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

పునర్వసు నక్షత్రం సందర్భంగా బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి భక్తులను అనుగ్రహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *