శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 7 నుండి 9వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఇందులో భాగంగా సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా నేడు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్టు 8న బుధవారం పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 9న గురువారం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *