వైభవంగా ముగిసిన కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. 

అశ్వ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి ద‌ర్శ‌నం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు.

వైభవంగా శ్రీ కోదండరాముని చక్రస్నానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్క‌రిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో ఊరేగింపుగా పుష్క‌రిణి వ‌ద్ద‌కు వేంచేశారు.

ఉదయం 10.30 నుండి 11.15 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు అందుకున్నారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

ధ్వజావరోహణం

రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు.

బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *