వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 4.20 గంటలకే సర్వదర్శనం ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగ‌ళ‌వారం ఉదయం 4.20 గంటలకే సర్వదర్శనం ప్రారంభించడంతో సామాన్యభక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నిర్దేశించిన స‌మ‌యానికి ఒక గంట ముందుగానే సర్వదర్శనం ప్రారంభం కావ‌డంతో భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఈ పర్వదినం సందర్భంగా టిటిడి ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

సోమ‌వారం ఉద‌యం నుండి ఒక ల‌క్ష మందికి పైగా భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చారు. విఐపిల‌కు ప‌రిమిత సంఖ్య‌లోనే ద‌ర్శ‌న టికెట్లు కేటాయించి, సామాన్య భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతమైన ద‌ర్శ‌నం టిటిడి కల్పించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నారాయ‌ణ‌గిరి షెడ్ల‌లోని భ‌క్తుల‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి, ఆల‌య మాడ వీధుల్లోని షెడ్ల‌లో గ‌ల భ‌క్తుల‌ను నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోకి పంపించారు. ఇంకా ప్ర‌స్తుతం వేచి ఉన్న భ‌క్తుల‌కు బుధ‌వారం ఉద‌యం శ్రీ‌వారి ద‌ర్శ‌నం ల‌భిస్తుంది. ఆయా ప్రాంతాల్లో వేచి ఉన్న భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అన్నప్ర‌సాదాలు, తాగునీరు. వైద్య‌సౌక‌ర్యం క‌ల్పిస్తున్నారు.

శ్రీ‌వారి ఆల‌యంలో శోభాయ‌మానంగా పుష్పాలంకరణ

శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా 400 చిలుకలు, చెరకుగడలు, పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారు. శ్రీవారి ఆలయం వద్దగల వాహన మండపం ఎదురుగా విష్ణుమయం పేరుతో భక్తులను ఆకట్టుకునేలా సెట్టింగ్‌ ఏర్పాటుచేశారు. ఇందులో మంచు ఎఫెక్ట్‌తో సప్తద్వారాలతో కూడిన శ్రీ రంగనాథస్వామి, శ్రీ రంగనాయకి అమ్మవారు, శ్రీ మహావిష్ణువు దశావతారాలను రూపొందించారు.

swarna radhotsavam in tirumala

వైభవంగా స్వర్ణరథోత్సవం :

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.

డిసెంబ‌రు 19న వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం

డిసెంబ‌రు 19న వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నానమహోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం. కాగా వైకుంఠద్వాదశినాడు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *