
వేంకటాద్రి యాప్: తిరుమలకు విచ్చేసే భక్తులు వివిధ ప్రాంతాలను సులభంగా గుర్తించడంతోపాటు అవసరమైన గమ్యాలను త్వరగా చేరుకునేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. ఇందులో 24 గంటల పాటు సేవలందించే కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వాయిస్ కమాండ్ల ద్వారా తాగునీటి కేంద్రాలు, దర్శన ప్రవేశ ద్వారాలు తదితర ప్రదేశాలను భక్తులు సులభంగా గుర్తించవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం తక్కువగా ఉన్నా, పూర్తిగా అందుబాటులో లేకపోయినా ఉపయోగించుకునేలా ఆఫ్‌లైన్ నావిగేషన్ సదుపాయాన్ని కూడా ఇందులో కల్పించారు.
వేంకటాద్రి యాప్ లో 350 పైగా ప్రదేశాల వివరాలు
వేంకటాద్రి యాప్ లో 25 విభాగాలకు సంబంధించి 350కు పైగా ప్రదేశాల వివరాలను పొందుపరిచారు. వీటిలో తాగునీటి కేంద్రాలు, ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, పార్కింగ్ ప్రదేశాలు, మరుగుదొడ్లు, బస్ స్టాప్‌లు, దర్శన ప్రవేశ ద్వారాలు, లగేజీ కేంద్రాలు, ఉచిత పాదరక్షల డిపాజిట్ కేంద్రాలు, అన్న ప్రసాద కేంద్రాలు, ఆహార విక్రయ కేంద్రాలు, క్యాంటీన్లు, గది కేటాయింపు కౌంటర్లు, భక్తుల సహాయ కేంద్రాలు, టీటీడీ కార్యాలయాలు, ఉప విచారణ కార్యాలయాలు, కల్యాణకట్టలు, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు, ఆలయ పరిసరాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం తదితర సదుపాయాల వివరాలు ఉన్నాయి.
వేంకటాద్రి యాప్ అత్యవసర ఫోన్ నెంబర్లు
వేంకటాద్రి యాప్ లో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంప్రదించేందుకు అత్యవసర ఫోన్ నంబర్లు, పోలీస్ సేవలు, టీటీడీ హెల్ప్‌లైన్ వివరాలను పొందుపరిచారు. బస్సు మార్గాలు, సమయాలను కూడా తెలుసుకోవచ్చు. ‘మార్క్ మై స్పాట్’ సదుపాయం ద్వారా భక్తులు తాము పార్కింగ్ చేసిన ప్రదేశాన్ని లేదా ఇతర ముఖ్యమైన ప్రాంతాన్ని గుర్తుగా సేవ్ చేసుకుని, తిరిగి ఆ ప్రదేశానికి సులభంగా చేరుకోవచ్చు.
‘వేంకటాద్రి’ యాప్‌ను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రూపొందించారు. ఇది యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్లు లేని భక్తులు కూడా ఈ సేవలను వినియోగించుకునేందుకు కియోస్క్‌ల ద్వారా యాప్ సేవలను అందించే ఏర్పాట్లను టీటీడీ చేపడుతోంది.
భక్తులకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం సులభంగా అందించడం ద్వారా తిరుమలలో వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడంతోపాటు, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుందని టీటీడీ తెలిపింది.

