మార్చి 14న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 14వ తేదీన వార్షిక పుష్పయాగం వైభవంగా జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విధంగానే ఇక్కడ పుష్పయాగం నిర్వహించనున్నారు.

pushpayagam

మార్చి 13వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది. మార్చి 14వ తేదీ బుధవారం ఉదయం 7.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 5.00 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

రూ.516/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు. శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 14వ తేదీ అష్టోత్తర శతకలశాభిషేకం, ఆర్జిత కల్యాణోత్సవంసేవలను టిటిడి రద్దు చేసింది.

ఇటీవల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *