నాటి సిద్ధకూటమే నేటి శ్రీనివాసమంగాపురం

క్రీ.శ 14వ శతాబ్దం నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు శాసనాధారాల ప్రకారం తెలుస్తోంది. క్రీ.శ 1433వ సంవత్సరంలో చంద్రగిరిని పాలించిన విజయనగర రాజుల వంశానికి చెందిన రెండవ దేవరాయ తిరుమలలో క్రమపద్ధతిలో వేదపారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది.

ఈ విషయాన్ని ఆలయాధికారి తెలుసుకుని సిద్ధకోట్టై అని పిలవబడే శ్రీనివాసపురానికి(ఇప్పుడు శ్రీనివాసమంగాపురం) చెందిన 24 మంది మహాజనులను స్వామివారి ఆస్థానంలో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు. దీనికి ఆమోదం తెలిపిన రాజుగారు ఇందుకయ్యే ఖర్చు కోసం తన రాజ్యపరిధిలోని సిద్ధకోట్టై గ్రామం నుండి రాజ్య భాండాగారానికి వచ్చే సొమ్ములో అర్ధ భాగాన్ని మంజూరు చేశారు.

అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మనవడైన శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులు శ్రీకళ్యాణవేంకటేశ్వరుడి ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి పూజలను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీ.శ 1540లో చంద్రగిరిని పాలించే అచ్యుతరాయలు మంగాపురం గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారం(పన్నులేని భూమి)గా శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులకు అందజేశారు.

ప్రకృతివైపరీత్యాలకు యవనుల దండయాత్రలకులోనై, శిథిలమైన ఈ గుడిని గోపురాలను పునర్‌నిర్మించి శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటుచేసి ఉత్సవాలు ఊరేగింపులు చిన తిరుమలయ్య నిర్వహించినట్లు అప్పటి శాసనాలు చెబుతున్నాయి.

అర్చకులు శ్రీ సుందరరాజస్వామివారి నుంచి 1967వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకుంది. ఆలయాన్ని పునరుద్ధరించి దిట్టం ఏర్పరిచింది. 1981వ సంవత్సరం నుంచి స్వామివారి నిత్యకల్యాణం, సాక్షాత్కార వైభవోత్సవం, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2007, నవంబరులో ఆలయ మహాసంప్రోక్షణ జరిగింది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *