ధనత్రయోదశి రోజు ఏయే దేవతలను పూజించాలి?

ధనత్రయోదశి : దీపావళి పండుగకు రెండు రోజుల ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి (ధంతేరాస్) అంటారు.

ధనత్రయోదశి విశిష్టతలు

ధన్వంతరి పూజ

 అశ్వయుజ బహుళత్రయోదశి రోజున దేవదానవులు ఇరువురూ కలిసి క్షీరసాగర మధనం చేస్తుండగా   ఆ సమయంలో ఆయుర్వేద విజ్ఞాన ప్రదాత, అమృత కలశహస్తుడైన ధన్వంతరి భగవానుడు  ఉద్భవించాడు. అందుకే దీనిని ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు. అందుకే ఆ రోజున ధన్వంతరి జయంతిని కూడా ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

మహాలక్ష్మి పూజ

క్షీరసాగర మథనంలో ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మితో పాటు కుబేరుడు కూడా ఈ రోజు వెలువడ్డాడని నమ్మకం. ఈ రోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తే సిరిసంపదలు కలుగుతాయి.

బంగారం కొనుగోళ్లు

ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలు, రాగి లేదా వెండి పాత్రలు, కొత్త వస్తువులు లేదా ధాన్యాలు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల అదృష్టం, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.

ధన త్రయోదశి పూజా విధానం

ఉదయాన్నే ఇల్లు, పూజా గదిని శుభ్రం చేసి, ముంగిట రంగవల్లులు (ముగ్గులు) వేసి, మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. పూజా పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి, దానికి ఇరువైపులా దీపాలు వెలిగించాలి. ఒక రాగి లేదా వెండి పాత్రలో నీరు, పోకచెక్క, నాణెం, అక్షతలు వేసి, పైన మామిడి ఆకులు, కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేయాలి.  పీఠంపై లక్ష్మీదేవి, గణపతి, కుబేరుడు మరియు ధన్వంతరి స్వామి ఫోటోలు లేదా విగ్రహాలను ఉంచాలి.

ధనత్రయోదశి రోజు మీరు కొనుగోలు చేసిన బంగారం, వెండి ఆభరణాలు, నాణేలు లేదా మీవద్ద ఉన్న పాతబంగారు వెండి వస్తువులు అయినా సరే పూజా పీఠంపై ఉంచి పూజించాలి. విగ్రహాలకు కుంకుమ, పసుపు, చందనం సమర్పించాలి. తామర పువ్వులు లేదా గులాబీలతో లక్ష్మీ అష్టోత్తరం, ధన్వంతరి స్తోత్రాలు పఠిస్తూ పూజ చేయాలి. లక్ష్మీదేవికి బెల్లపు పాయసం,  ధన్వంతరి స్వామికి బెల్లంతో చేసిన ఏదైనా నైవేద్యం సమర్పించాలి.

ధనత్రయోదశి రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు

యమ దీపం 

ధనత్రయోదశి రోజున  సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం బయట, కుడి వైపున (ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు) దక్షిణ దిశగా ముఖం ఉండేలా నువ్వుల నూనెతో నాలుగు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల అకాల మృత్యు భయం తొలగుతుంది.

ఉప్పుకొనుగోలు

ధనత్రయోదశి రోజున రాళ్ళ ఉప్పు కొనడం చాలా శుభప్రదం. ఆ ఉప్పుతోనే ఆ రోజు వంటకాలు చేయాలి. ఇది ఇంట్లోని, మనలోని నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.

కొత్త చీపురు కొనుగోలు

ధనత్రయోదశి రోజు కొత్త చీపురు కొనడం లక్ష్మీదేవి రాకకు సూచనగా భావిస్తారు.

దానధర్మాలు చేయడం

ధనత్రయోదశి రోజు పేదలకు అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.

ధనత్రయోదశి రోజున ఇవి చేయకూడదు

ధన త్రయోదశి రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే పదునైన వస్తువులు (కత్తులు, కత్తెరలు) మరియు ఇనుప వస్తువులు కొనుగోలు చేయకూడదు.

ధనత్రయోదశి నాడు ఏయే దేవతలను పూజించాలి? ఏయే ఫలితాలు కలుగుతాయి?

  • లక్ష్మీ కుబేరులను తామర పువ్వులతో పూజించి, పాయసం నైవేద్యం చేస్తే ఐశ్వర్యం, సిరిసంపదలు వృద్ధిపొందుతాయి.
  • ధన్వంతరి భగవానుని పసుపు, తులసిదళాలతోను, ఔషధ మూలికలను  అర్చించాలని పెద్దలు చెబుతారు.దీనివల్ల ఆయురారోగ్యాలు కలిగి వ్యాధులు ఉపశమిస్తాయి.