తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు మంగళవారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల శ్రీపెద్దజీయంగార్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్వాగతం పలికారు. అక్కడ శ్రీశ్రీశ్రీపెద్దజీయంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేదని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. 
ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించినట్టు చెప్పారు. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని తెలియజేశారు.
శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద నుండి మంగళవాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల గుండా ఊరేగింపుగా గోదాదేవిమాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *