తిరుమలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుమలలో మంగళవారం జరుగనున్న శ్రీ కృష్ణజన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత మంగళవారం రాత్రి 8.00 నుండి 10.00 గంటల నడుమ గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.

అదేవిధంగా గోగర్భం డ్యామ్‌ చెంత వెలసియున్న ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణుడుకి ఉదయం 11.00 గంటలకు పంచాభిషేకాలు ఘనంగా జరుగనున్నాయ. అభిషేకానంతరం ఇదే ప్రాంగణంలో మధ్యాహ్నం 12.00 గంటలకు ఉట్లోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు. అటుతరువాత ప్రసాద వితరణ కార్యక్రమం జరుగనుంది.

కాగా ఆగస్టు 16వ తేదీ బుధవారం తిరుమలలో ఉట్లోత్సవాన్ని మధ్యాహ్నం 1.00 గంట నుండి సాయంత్రం 5.00 గంటల మధ్య ఆలయ నాలుగు మాడ వీధులలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహముతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 16వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *