తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం

పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీకవనభోజన మహోత్సవం ఆదివారంనాడు తిరుమల పార్వేట మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ తిరుమలలో 400 ఏళ్ల క్రితం వనభోజన మహోత్సవం జరిగేదని, 2010వ సంవత్సరంలో పునరుద్ధరించామని తెలిపారు. ప్రతి ఏడాదీ పవిత్ర కార్తీకమాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించినట్టు తెలిపారు.
కాగా, ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. ఇక్కడి నక్షత్రవనంలో దేవతామూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పార్వేట మండపంలో మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. 
వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో ఆదివారంనాడు కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఇందులో వేలాదిమంది భక్తులు పాల్గొని రుచికరమైన అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *