
గోరింటాకు ఆషాడంలో తప్పపనిసరిగా పెట్టుకోవాలని మన పెద్దలు చెపుతూ ఉంటారు. గోరింటాకు పెట్టుకోవాలి కదా అని ప్రస్తుతం మార్కెట్లో దొరికే కోన్ లు పెట్టుకోవడం కాదు. గోరింట చెట్టునుంచి ఆకును తెచ్చి, వాటిని రుబ్బి గోళ్ళకు కూడా గోరింటాకు పెట్టుకోవాలి. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి. ఆషాడం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలనేది పూర్వకాలం నుండి పెద్దలు చెబుతున్న మాట. ఎందుకంటే వర్షాలు ఆషాడంలో ఊపందు కుంటాయి. అప్పటి వరకూ ఎండ వేడిమితో అల్లాడిన మనం కాస్త హాయిగా ఫీలయ్యే మాసం ఇది. దీంతో చిన్నా పెద్దా ఏదో కారణం చెబుతూ వానలో తడిసేందుకు ఇష్టపడతారు. వ్యక్తిగత పనుల కారణం చేత కూడా తరచూ వర్షపు నీటిలో నానుతుంటాం. చెరువుల్లో, కాలువల్లో కొత్త నీరు వచ్చి చేరుతుంది.
ఆషాడంలో వర్షాలు బాగా పెరిగి పొలం మడుల్లో నీరు చేరుతుంది. కొత్త నీరు కుళ్లిన చెత్త, కీటకాలతో నిండి ఉంటుంది. నీరు పూర్తిగా ప్రక్షాళన అయ్యే వరకూ శుద్ధి అవదు. ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడప కుండా రోజు గడవదు. దీంతో పలు వ్యాధులు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఎక్కువగా చర్మవ్యాధులకు గురవుతాం, గోళ్లు దెబ్బతినడం వంటి సహజ మార్పులు గమనిస్తాం. గోరింటాకు ఇలాంటి వ్యాధుల్ని దరిచేరనీకుండా కొంతవరకూ ఆపుతుంది.

ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు పుట్టింటికి చేరుకుంటారు. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. గోరింటాకు ఆడపిల్లల చేతులకు కోమలత్వాన్ని తెచ్చిపెడుతుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల అవి అందంగా ఉండడమే కాకుండా గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా రక్షింపబడతాము.
వైద్యంలో గోరింటాకు
గోరింటాకు ఆయుర్వేదవైద్యంలో ఎంతగానో ఉపకరిస్తుంది. గోరింట ఆకులే కాదు. పూలు,వేళ్ళు ,బెరడు,విత్తనాలు..అన్నీ ఔషధ యుక్తాలే ! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు…అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టు కోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.

