కలహ శృంగార భరితమైన ఉత్సవం ప్రణయ కలహోత్సవం

నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలో కొలువైవున్న ఉత్సవాల దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ఉత్సవం ప్రణయ కలహోత్సవం డిసెంబ‌రు 23వ తేదీన‌ తిరుమలలో వైభ‌వంగా జరుగనుంది.

కాగా ప్రణయకలహోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గం||ల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవమండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరపున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు.

ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది.

పౌర్ణమి గరుడసేవ రద్దు

ప్రతినెలా పౌర్ణమినాడు నిర్వహించే శ్రీవారి గరుడసేవను గురువారం టిటిడి రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో డిసెంబరు 7వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ కారణంగా పౌర్ణమి గరుడసేవను రద్దు చేశారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *