ఋషిపంచమి విశేషాలు తెలుసుకోండి

మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లే కదా… ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ! అదే పనిని మనం ఋషి పంచమి సందర్భంగా చేస్తాము. ఋషులను పూజించి వారిని సంతుష్టులను చేసే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియోలో ఋషి పంచమి విశేషాలు తెలుసుకుందాం

కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మతాః!!

కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్టుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్త ఋషులు. ఋషిపంచమి సందర్భంగా అంటే భాద్రపద శుద్ధ పంచమి నాడు (ఈ ఏడాది ఆగష్టు 26వతేదీన) సప్తర్షులను భక్తి శ్రద్ధలతో పూజించాలని పురాణాల్లో పేర్కొనబడింది.  ఒకవేళ ఏడుగుర్ని కాకపోయినా వీరిలో ఐదుగురినైనా తప్పనిసరిగా స్మరించుకొని అర్చించాలన్నారు పెద్దలు. అందుకే ఈరోజును ఋషి పంచమి అన్నారు. ఆ ఐదుగురు ఎవరంటే మొదటగా అత్రి, ఈయన భార్య అనసూయ, వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంట. ఇక రెండవ వారు భరద్వాజుడు, ఆపై గాయత్రీ మంత్ర స్రష్ట విశ్వామిత్రుడు, వశిష్టుడు, ఇంకా జమదగ్ని.

నిజానికి ఈ పండుగ స్త్రీలకూ సంబంధించినది. దీనిని భాద్రపద శుద్ధ పంచమి రోజున ఆచరించాలని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తోంది. ఋషి పంచమి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో చేసిన దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మదేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తుంది.

ఋషి పంచమి వ్రతం

మన ప్రాచీన ఋషులను పూజించే వ్రతమే ఋషి పంచమి. భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓఋషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన ఋషుల వంశాను క్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియక పోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.

వ్యాస మహాముని

ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా  సప్తర్షులను పూజించటం సృష్టిలో ఆనవాయితీగా వస్తున్నది. రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను వ్యాసుని రూపంలో అవతరించి ఆ మహావిష్ణువు ఉపనిషత్తులు, పురాణాల రూపంలో మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.

కశ్యప ప్రజాపతి

సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వక్షలతాత్పణ జాతులు, సింహ, మగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

అత్రి మహర్షి 

సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

భరద్వాజుడు

భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బహస్పతి కప వలన జన్మించి, ఘతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

విశ్వామిత్రుడు

విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భలతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

జమదగ్ని మహర్షి

జమదగ్ని ఋషి-రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.

వశిష్ట మహాముని

ఏడో ఋషి వశిష్టుడు. ఇతని భార్య అరుంధతి. వశిష్టుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు. స్వాయంభువ మన్వంతరంలోనూ సప్తఋషుల్లో ఒకడు. ఒకప్పుడు మిత్రా వరుణులకు ఊర్వశిని చూసి రేతస్సు స్కలితం కాగా కుండలో వశిష్టుడు, అగస్త్యుడు జన్మించారని ప్రతీతి.

సప్తర్షులు తేజస్సు గలవారు…

కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగి పోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు ఋషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాత:కాల స్మరణతో శుభాలను కలగ జేస్తాయంటారు. అందుకే భాద్రపద శుక్లపక్ష పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకత దోష పరిహారం కొరకు విధివిధానంగా పూజిస్తారు. సుమంగళులు ఋషులను పూజించి తమ దోషాలను దూరం చేసుకొని, ఆయువు, బలం, యశస్సు, ప్రజ్ఞ పొందగలరని ఋషి పంచమి వ్రతవిధానం తెలుపుతోంది. సప్తర్షుల ప్రతిమలు చేయించి, షోడశోపచారాలతో పూజించి, ఋత్విక్కులను సంతుష్టులను చేసి, భోజనం ఏర్పాటు చేసి వారి ఆశీర్వాదాలందుకోవాలి. అలా చేసినవారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వివరించినట్లు పౌరాణిక వ్రతకథలు తెలుపుతున్నాయి. ఋషిపంచమి భారతీయ సంస్కతిలో చిరస్థాయిగా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *