జగన్నాధ రథయాత్ర 2022: జగన్నాధ రథయాత్ర తిలకించేందుకు వేయికళ్ళు చాలవు

 ప్రతీ హిందువు జీవితంలో కనీసం ఒకసారైనా పూరీలో జరిగే రథయాత్ర చూడాలని తపిస్తారు. అంతటి మహిమాన్వితమైన పూరీ జగన్నాధుని రథయాత్ర ఈ ఏడాది జూలై 1న జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ రథయాత్రా విశేషాలు మీకోసం…

జగన్నాధ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుంచి మధుర వరకూ చేసే యాత్రగా పరిగణిస్తారు. జగన్నాధ ఆలయంలో ఉండే జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను అంగరంగ వైభవంగా అలంక రించిన రథంలో అధిష్టింపచేసి ఘనంగా యాత్ర నిర్వహిస్తారు. ఆలయం ముందు నుంచీ ప్రారంభమయ్యే యాత్ర సుమారు కిలోమీటరు దూరంలోని గుండీచ మందిరం అనే ప్రాంతం వరకూ సాగుతుంది. ఈ రథ యాత్రకు దేశవ్యాప్తమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. 

రధాల విశేషాలు

జగన్నాథ రథాన్ని నందిఘోష అంటారు. ఇది పసుపు రంగులో ఉంటుంది. బలభద్రుని రథం పేరు తాళ ధ్వజం, ఇది ఆకుపచ్చని రంగులో ఉంటుంది. నలుపు రంగులో 

ఉండే సుభద్రాదేవి రధాన్ని దేవదళనం అంటారు. పూరీ రాజవంశానికి చెందినవారు బంగారు చీపురులతో రథయాత్రకు ముందు నేలను శుభ్రం చేసే సంప్రదాయాన్ని ”బెహరా పహరా” అంటారు. ప్రతి ఏడాది మూడు కొత్త రథాలు చేయించడం ఇక్కడి నియమం. 

రథాల నిర్మాణం ఇలా..

జగన్నాధుని రథానికి 16 చక్రాలు ఉంటాయి. రథ యాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియ నాడు రధోత్సవ పనులు మొదలవుతాయి. ముందుగా పూరీ మహారాజు ఆదేశాల ప్రకారం కొత్తగా కలప సేకరించాక, వాటికి వేదపండితులు శాంతి నిర్వహిస్తారు. సేకరించిన కలపను జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను పూరీకి తరలి స్తారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడు తుంది. ముందు వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రా దేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు. సారథి పేరు దారుక. బల భద్రుడి తాళధ్వజం. సుభద్రాదేవి దేవదళన్‌ రధాలను నిర్మాణం పూర్తయ్యాక వాటిని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహ ద్వారం దగ్గర నిలబెడ తారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. ఎంత వర్ణించినా సరిపోని వైభవంతో సాగే ఈ రధయాత్రను చేసేందుకు వేయి కళ్లు చాలవు. మరెందుకు ఆలస్యం మీరూ బయలుదేరండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *