వైభవంగా తిరుపతి శ్రీ కోదండరాముడి చక్రస్నానం

తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శుక్రవారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ముందుగా ఉదయం 7.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

ఆ తరువాత అక్కడినుండి స్వామివారు శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పి.ఆర్‌ తోటకు వేంచేశారు. సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్తవీధి మీదుగా శ్రీ కోదండరామాలయానికి చేరుకున్నారు. మధ్యలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీవైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించారు.

ధ్వజావరోహణం

తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *