తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టిటిడి సారె

తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను ఆదివారం టిటిడి అధికారులు సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆడికృతికను పురస్కరించుకుని శ్రీసుబ్రమణ్యస్వామివారికి టిటిడి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తోంది.

చారిత్రక ప్రాశస్త్యం

భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనది. ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తన ఇరువురు దేవేరులలో ఒకరైన శ్రీ వల్లీదేవిని  పరిణయం ఆడినట్లు పురాణ ప్రాశస్త్యం. తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ”ఆరుపడైవీడు” లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవల్లి, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.

తిరుత్తణి క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపధ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృతిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను మోసుకు వెళ్ళి మొక్కుబడులు చెల్లించడం విశేషం.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *