చిరుజల్లుల మధ్య వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు గురువారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిసాయి.

సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.

ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు.

తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన బృందం పసిడి అక్షింతలవి…, చూడరమ్మ సతులాల, తెలిసిన వారికి దేవుడితడే…, తదితర అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.

అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *