ఏకశిలపై సీతారామ లక్ష్మణులు కొలువైన క్షేత్రం

ఒంటిమిట్ట కోదండరామాలయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎస్‌ఆర్‌  కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం . ఇది ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఈ ఒంటిమిట్ట ఉంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీరామనవమి వేడుకలను ఒంటిమిట్టలో అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తోంది. 

కోదండ రామాలయం చరిత్ర

ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందిందిన ఒంటిమిట్ట ఆలయంలో మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఇక్కడ అందుబాటులో ఉన్న ఆలయ చరిత్ర ప్రకారం ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు, కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి, ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. 

ఒంటిమిట్ట స్థల పురాణం

రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకెళ్ళాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. ఆకాలంలో మృకండ మహర్షి, శృంగి మహర్షి తమ యాగ రక్షణ కోసం రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆస్వామి సీతా లక్ష్మణ సమేతుడై అమ్ములపొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబ వంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకేశిలలో శ్రీరాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలు చెక్క బడ్డాయని చెప్పుకున్నాం. కాగా దేవాలయాల లోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హను మంతుని విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న కథనం చెబుతోంది.

ఆలయ విశేషాలు

ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు 1863- 1936 మధ్య ప్రాంతంలో ఈ రామాలయాన్ని పునరుద్ధరించారని తెలుస్తోంది. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని కూడా నిర్మించాడు. ఈయన కొబ్బరికాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగారు. 

చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన ‘’శ్రీరఘువీర శతకాన్ని’’ రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.

ఆలయ గొప్పదనానికి మచ్చుతునక

ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్‌ బావి ఒకటి. ఇమాంబేగ్‌ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్‌ నబీఖాన్‌ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ‘ఓయ్‌‘ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్య చకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్‌ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం. పుట్టపర్తికి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపోతుంటారు.

ప్రత్యేక ఉత్సవాలు

శ్రీరామనవమి వేడుకలతో పాటు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. ఈ ఏడాది ఈ ఆలయంలో నవమి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఈ ఆలయం జిల్లా కేంద్రం కడప నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైల్వే స్టేషన్‌ కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *