ధ్వజస్తంభం లేని శివాలయం- 108 శైవ క్షేత్రాల్లో ఒకటి- కేరళలోని రాజరాజేశ్వర ఆలయం

 

కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో తలిపరంబ పట్టణంలో ఉన్న ఒక మహా పవిత్రమైన శైవక్షేత్రం —  శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ శ్రీ రాజరాజేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన, పురాతనమైన శివాలయాలలోఒకటి. 

ఈ ఆలయం శివుడు రాజరాజేశ్వరుగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రం కేరళలోని 108 ప్రాచీన శివాలయాలలో ఒకటిగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి శివలింగం స్వయంభూ — అంటే స్వయంగా ఉద్భవించినదిగా విశ్వసిస్తారు. ఈ లింగం జ్యోతిర్లింగంతో సమానమైన శక్తి కలిగినదిగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని కాశీ విశ్వేశ్వరుడితో సమానంగా పూజిస్తారు. ఇక్కడ శివుడు చాలా శాంత మూర్తిగా, ఐశ్వర్య ప్రదాతగా దర్శనమిస్తాడు. 

ఇక్కడ ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది…

శివుడు పార్వతీ దేవికి మూడు పవిత్ర శివలింగాలను ఇచ్చాడు. వాటిని మాంధాత, ముచుకుంద వంటి మహర్షులు ప్రతిష్ఠించారు. అయితే అవి అదృశ్యమైపోయాయి. కానీ చివరగా సతసోమరాజు ప్రతిష్ఠించిన శివలింగమే ప్రస్తుతం మనం దర్శించే ఈ దేవుడు అని చెబుతారు.

ఈ ఆలయం నిర్మాణం కేరళ సంప్రదాయ శైలిలో ఉంటుంది. రెండు అంతస్తుల గర్భగుడి, రాగి పూతతో కూడిన పైకప్పు, పెద్ద ప్రాకార గోడలు ఈ ఆలయ ప్రత్యేకతలు. ఆశ్చర్యకరంగా, ఇక్కడ సాధారణంగా ఉండే ధ్వజస్తంభం లేదు.

ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న కొన్ని ప్రత్యేక ఆచారాల గురించి చూద్దాం…

నమస్కార మండపం

    ఈ ఆలయంలోని నమస్కార మండపం చాలా ముఖ్యమైనది. దానిపైకి ఎవరూ ఎక్కకూడదు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు రావణ సంహారం తర్వాత తిరిగి వస్తూ ఇక్కడ ఆగి, ఈ మండపంపై కూర్చుని శివుని ప్రార్థించాడని చెబుతారు. ఆయన పట్ల గౌరవార్థం ఇప్పటికీ ఎవరూ దానిపైకి వెళ్లరు. 

బుధవారం ముఖ్యమైనరోజు

ప్రతీచోటా శివాలయంలో సోమవారం శివారాధనకు ముఖ్యంగా భావిస్తారు అలా కాకుండా ఈ రాజరాజేశ్వర ఆలయంలో బుధవారం  శివారాధనకు ముఖ్యమైన రోజు.

ఇక్కడ శివునికి నెయ్యిని సమర్పించడం అత్యంత ప్రధానమైన పూజ. ఇది గ్రహ దోషాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం.

సాయంత్రం సమయంలో మహిళలకు ప్రవేశం

    మహిళలకు ఆలయంలో ప్రవేశం సాయంత్రం సమయంలో 7:30 నుంచి 8:30 వరకు మాత్రమే ఉంటుంది,  ఆ సమయంలో శివుడు పార్వతీ దేవితో కలిసి ఉంటాడని, ఆ సమయంలో చేసిన ప్రార్థనలు త్వరగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

ఆలయ ప్రవేశం చేయాలంటే విధిగా పంచె లేదా ధోతి కట్టుకుని చొక్కా లేకుండా దర్శనం చేసుకోవాలి.

ఈ ఆలయంలో నిత్య పూజలు ఎంతో విశిష్టంగా జరుగుతాయి. ఉదయం నిర్మాల్యం దర్శనం చాలా పవిత్రంగా భావిస్తారు. అభిషేకాలు, నవకాభిషేకం అంటే తొమ్మిది కలశాలతో చేసే పూజ వంటి పూజలు ఇక్కడ ప్రధానంగా జరుగుతాయి.

ఇంకా ఒక విశేషం ఏమిటంటే… ఈ ఆలయంలో ఇతర దేవాలయాల్లా వార్షిక ఉత్సవాలు జరగవు. ఇది చాలా అరుదైన విషయం. శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తారు.

900 ఏళ్ళు పైబడిన వృక్షం

సుమారు వెయ్యి సంవత్సరాలకు పైబడ్డ చరిత్ర కలిగిన ఈ ఆలయం ఆవరణలో 900 సంవత్సరాలనుంచీ  ఉన్న ఒక  వృక్షం మనకు దర్శనం ఇస్తుంది. ఆ చెట్టు ఆలయ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది.  

దర్శన సమయాలు 

ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 వరకు.

 తళిపరంబలోని ఈ శ్రీ రాజరాజేశ్వర ఆలయం అనేది ఆధ్యాత్మిక శక్తి, చరిత్ర, సంప్రదాయం అన్నీ కలిసిన ఒక మహత్తర క్షేత్రం.

ఎలా వెళ్లాలి?

  • సమీప నగరం: కన్నూర్ (~23 కి.మీ)
  • రైల్వే స్టేషన్: పజయంగాడి (~15 కి.మీ)
  • రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *