శాస్త్రోక్తంగా ముగిసిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ

తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్ళకోసారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం శాస్త్రోక్తంగా ముగిసింది.

ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన నిష్ణాతులైన ఋత్వికులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగమ సలహా మండలి సూచనల మేరకు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ సమక్షంలో ఆలయ ప్రధానార్చకులు శ్రీవేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో వైభవంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాన్న ఆగమోక్తంగా నిర్వహించారు. 44 మంది ఋత్వికులు, 100 మంది వేదపండితులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఆగస్టు 11 నుండి ఆగస్టు 15వ తేదీ సాయంత్రం వరకు 1.35 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆగస్టు 17వ తేదీ నుండి యధావిధిగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని  టీటీడీ  తెలిపింది.

ఉదయం 10.30 గంటలకు అర్చకులు శ్రీ ఖాద్రి నరసింహాచార్యులు చేతులమీదుగా ఆనందనిలయ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ జరిగింది. యాగశాల కార్యక్రమాల అనంతరం శ్రీభోగశ్రీనివాసమూర్తి, శ్రీఉగ్ర శ్రీనివాసమూర్తితోపాటు ఇతర దేవతామూర్తులను తిరిగి పూర్వస్థానాల్లోకి వేంచేపు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమవుతుందని టిటిడీ తెలిపింది.

చివరిరోజు కార్యక్రమాల్లో భాగంగా 27 హోమగుండాల్లో పూర్ణాహుతి నిర్వహించారు. గర్భాలయంలో శ్రీవారి మూలమూర్తికి, ఉప ఆలయాల్లోని స్వామివారి విగ్రహాలకు ఆగమోక్తంగా కళావాహనం నిర్వహించారు. కలశాల్లోని శక్తిని తిరిగి విగ్రహాల్లోకి ఆవాహన చేయడాన్ని కళావాహనం అంటారు. ఆ తరువాత ప్రత్యేక ఆరాధనలు, విశేషనైవేద్యాలు సమర్పించిన అనంతరం అక్షతారోపణంతో మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగిసింది.

కాగా, ఉదయం కార్యక్రమాల్లో భాగంగా హోమగుండాలకు పూర్ణాహుతి, ప్రబంధ సాత్తుమొర, వేద సాత్తుమొర నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులతోపాటు ఋత్వికులను ఆలయ ప్రదక్షిణగా అర్చక నిలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అర్చక బహుమానం సమర్పించారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *