అంగరంగవైభవంగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దివ్యకళ్యాణ మహోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరుకొండ  లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణోత్సవాలు నేటి నుంచి ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఇందుకు సంబంధించి ధ్వజారోహణ, అంకురార్పణ చేసారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మార్చి రెండవ తేదీన ముగుస్తాయి. అనంతరం మూడవతేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. ఆరోజు సాయంత్రం 6.30 గంటలకు స్వామివారు ఆలయం చుట్టూ ద్వాదశ ప్రదక్షిణలు చేస్తారు. వివిధ రకాల పళ్ళు, ప్రసాదాలు నివేదిస్తారు. విశేష పుష్పాలంకరణ చేసి పుష్పయాగాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆ తర్వాత స్వామివారికి పవళింపుసేవ జరుగుతుంది.

ఉత్సవాలు జరిగే తేదీల వివరాలు ఇవీ…

radhotsavam

మొదటిరోజు….

ఉత్సవాల్లో తొలిరోజు ప్రధానఘట్టం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గ్రామంలోని రాజవీధుల్లో రథోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు సుదూర ప్రాంతాలనుంచి తరలివస్తారు. భారీరథంలో ఊరేగుతున్న స్వామివారిని చేతులుజోడించి వేడుకుంటూ అరటిపళ్ళు సమర్పించడం ఇక్కడి ఆచారం. భారీ బందోబస్తు మధ్య రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. వేదపండితుల సమక్షంలో వైఖానస ఆగమ సాంప్రదాయాలను అనుసరించి అంగరంగవైభవంగా జరిగే స్వామి, అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా గాంచి తరిస్తారు.

రెండవరోజు….

కళ్యాణోత్సవాల్లో రెండవరోజు అంటే ఈ నెల 27వ తేదీ రాత్రి 9 గంటలకు గరుడవాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది.

మూడవరోజు…

మూడోరోజు అంటే 28వ తేదీ రాత్రి 7.30 గంటలకు స్వామివారి ఆలయముఖమండపంలో వేదపండితుల సమక్షంలో సదస్యం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు ఆంజనేయవాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు.

నాలుగోరోజు….

మార్చి ఒకటిన రాత్రి 8.30 గంటలకు రంగరాజస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు గజవాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరుగుతాయి.

ఐదోరోజు….

మార్చి 2వ తేదీ ఉదయం 9 గంటలకు దేవుని కోరేరు వద్ద చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు ధ్వజ అవరోహణం, 6.30 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 9 గంటలకు శేషవాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు.

ఆలయానికి మార్గం

కోరుకొండలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఉంటాయి. రాజమహేంద్రవరం నుంచి ఏజెన్సీ ప్రాంతాలైన గోకవరం, రంపచోడవరం తదితర ప్రాంతాలకు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో  కోరుకొండ చేరుకోవచ్చు.

రాజమహేంద్రవరం నుంచి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం 20 కిలోమీటర్ల దూరం, కాకినాడ నుంచి 60 కిలోమీటర్లు , అమలాపురం నుంచి 70 కిలోమీటర్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *