ఘనంగా ”తిరుమలనంబి తన్నీరముదు” ఉత్సవం

 

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గ‌త ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుండి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు జనవరి 5,  శుక్ర‌వారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు.

గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా ప్ర‌తి రోజు స్వామివారికి నివేదించారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు.

శుక్ర‌వారంనాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ”తన్నీరముదు” ఉత్సవం నిర్వహించారు. అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటిరోజు అనగా జ‌న‌వ‌రి 6న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయానికి వేంచేయడం  ఆనవాయితీ.

శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాదీ నిర్వహించే ”తన్నీరముదు” ఉత్సవం తిరుమలలో శుక్ర‌వారం ఘనంగా జరిగింది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధి ఆలయ ప్రదక్షిణముగా వాహన మండపానికి వేంచేసారు. తిరుమలనంబి ఆలయం నుండి ప్రదక్షిణ‌గా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని వాహన మండపానికి తీసుకు రాగా వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు.

అనంతరం ఆల‌య అర్చ‌కులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమలనంబి రచించిన ”తిరుమొళి పాశురాలను” పారాయణం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు. 

 శ్రీ తిరుమలనంబి చెంతకు శ్రీ మలయప్పస్వామివారు

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ‌నివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ ”తన్నీరముదు” ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబివారికి మేల్‌చాట్‌ శేషవస్త్రాన్ని సమర్పించారు.

శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీతిరుమలనంబి. వీరు సాక్షాత్తు శ్రీ భగవత్‌ రామానుజాచార్యులవారికి మేనమామ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *