శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 18న శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని టిటిడి అత్యంత ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మూెత్సవం పర్వదినాలకు ముందుగా వచ్చే మంగళవారంనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలియచేశారు.

tirumala alayam

ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవలైన ఆష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. ఇతర ఆర్జిత సేవలు యధాతథంగా నిర్వహించారు.

ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన లేపనంతో ఆలయగోడలకు పూశారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *