శ్రావణ మంగళగౌరీ వ్రతం ఎందుకు చేసుకోవాలి?

నూతన దంపతుల వైవాహిక జీవితం మూడు పువ్వలు, ఆరు కాయలుగా సాగాలని, దీర్ఘ సుమంగళిగా జీవించాలనే ఉద్దేశంతో శ్రావణ మాసంలోని మంగళవారాలు మంగళగౌరి వ్రతం చేసుకుంటారు. వ్రత కధ ప్రకారం ఒక భిక్షువు కారణంగా శాపగ్రస్తులై అల్పాయుష్కుడైన కుమారుడిని కంటుంది ఒక కుటుంబం.  మంగళగౌరి వ్రతం చేసుకుని తన తల్లికి వాయనం అందించుకున్న అమ్మాయిని  వివాహమాడడంతో అల్పాయుష్కుడైన అతడు పూర్ణాయుష్కుడు అవుతాడు. అంటే మంగళగౌరీ వ్రతానికి అంతటి శక్తి ఉందని అర్ధం.

 మంగళగౌరి వ్రతం కుజుని శాంతింపచేయడంకోసం

మంగళగౌరి వ్రతం మాంగల్యబలం కోసం ఆచరిస్తారు. ఈ వ్రతంలో మంగళగౌరి దేవిని ఆరాధిస్తారు. ఈ వ్రతం వెనుక మరొక బలమైన కారణం కూడా ఉంది. మంగళవారానికి అధిపతి అయిన మంగళుడు అంటే కుజుని శాంతింప చేయడంకోసం కూడా మంగళగౌరి వ్రతం ఉద్దేశింపబడింది. మంగళగౌరి వ్రతంలో మనం గౌరి మాతను పూజిస్తాం. గౌరిని పూజించడం వల్ల కుజుని ద్వారా సక్రమించే బాధలు ఉపశమింపబడతాయి. ఎందుకంటే… భూమి పుత్రుడైన కుజుడు మంగళగౌరీ దేవి అనుగ్రహంతోనే మంగళవారానికి అధిపతి అయ్యాడని చెబుతారు.

కుజుడు స్ఫర్ధలకు కారకుడు, కుజుని కారణంగానే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అమ్మాయికి కుజుని పరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలని, కుటుంబంలో స్పర్థలు ప్రవేశించకూడదనే సంకల్పమే ఈ వ్రతం చేసుకోవడంలో ఉన్న మరొక ముఖ్యోద్దేశం. కుజదోషం ఉన్న మహిళలచే తప్పనిసరిగా ఈ వ్రతం చేయించాలని పెద్దలు చెబుతారు. కుజదోషం ఉన్నవారు, లేని వారు కూడా ఈ వ్రతం చేసి తీరాలన్నది ఒక నియమం. దోషం ఉంటే దోష ప్రభావం తగ్గుతుంది. లేనివారు దోషప్రభావానికి గురికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *