మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

 

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు.

భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అందులో హేయమైన విషంతోపాటు ఉపాదేయమైన అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోయారు. తత్ఫలితంగా వారు వంచింపబడడం, దేవతలు అనుగ్రహింపబడడం జరిగింది.

అనంతరం ఉదయం 10 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *