వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు.

హంస వాహనం 

శ్రీ కోదండరామస్వామివారి  బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *