చిత్రకూట్ లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

 

మహా కుంభమేళా సందర్భంగా త్రేతా యుగంలో రాములవారు సీతాదేవి, లక్ష్మణులతో కలిసి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన పవిత్రస్థలమైన మధ్య ప్రదేశ్ లోని చిత్రకూట్ నగరంలో ఉత్తరాది అహోబిల మఠంలో జనవరి 22 బుధవారం ఉదయం శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది.

ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చుకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు వేంచేపు చేసారు.

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.

చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *