భక్తుల మనోరథాన్ని అధిరోహించిన సిరుల తల్లి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం ఉదయం రథోత్సవం కన్నులపండుగ‌గా జరిగింది.

ఉదయం 8 గంటలకు ర‌థోత్స‌వం మొద‌లై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.

రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.

రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేసారు. అనంతరం అమ్మవారిని విశేష౦గా అల౦కరి౦చారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇచ్చారు. ర‌థోత్స‌వంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *