శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి వార్షిక పుష్పయాగం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 14వ తేదీన జరుగనున్న వార్షిక పుష్పయాగం గోడపత్రికలను శనివారం ఆవిష్కరించారు.

ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయి.

మార్చి 13వ తేదీ మంగళవారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది. మార్చి 14వ తేదీ బుధవారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

రూ.516/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు. పుష్పయాగం కారణంగా మార్చి 14వ తేదీన అష్టోత్తర శతకలశాభిషేకం, ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *