అలిపిరి కాలిబాట మార్గంలో భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని టిటిడి ఈవో శ్రీఅనిల్కుమార్ సింఘాల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో శనివారం సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కాలిబాట మార్గంలో మెట్లపై భక్తులు జారిపడకుండా తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఫిబ్రవరి నాటికి తిరుమలలో పూర్తిగా ఎల్ఇడి విద్యుత్ దీపాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వెండి వాకిలి ప్రాకారంలోని శ్రీనివాసకల్యాణం చిత్రాలకు ప్రత్యేక లైట్లు ఏర్పాటుచేయాలని సూచించారు. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు రిట్రాక్టబుల్ రూఫ్ ఏర్పాటుచేసి భక్తులకు వర్షానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. భక్తులు ప్రసాదాలు స్వీకరించే
ప్రాంతంలోని నీటికొళాయిల వద్ద పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచడంతోపాటు వేడినీటితో శుభ్రం చేసే ఆధునిక యంత్రాలను వినియోగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.



